మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దాడికి గురై చికిత్స పొందుతున్న మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు ఎస్టీ మహిళలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు ఒడిత్యా శంకర్‌నాయక్, ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ మారుమూడి విక్టర్‌ప్రసాద్‌లు మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఎస్టీ కమిషన్ సభ్యుడు నాయక్ అన్నారు. బాలిక ఇంటికి వెళ్లి గాయపరిచిన కె.కొత్తపాలెం భూస్వామిని అరెస్టు చేస్తామన్నారు. బాధితులు ఒక్కొక్కరికి రెండు లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించి.. ముందుగా రూ. 50 వేల చెక్కులు అందజేశారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్‌ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, కూలికి వచ్చిన గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన భూ యజమాని రాజాచంద్‌తో పాటు అతడి సోదరి రాధికను సచివాలయ మహిళా కానిస్టేబుల్, ఎస్‌ఐపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిధూర్జటి, రాష్ట్ర క్రిస్టియన్ కార్పొరేషన్ డైరెక్టర్ జక్కుల ఆనందబాబు, జిల్లా యానాది సంఘాల అధ్యక్షుడు శ్రీనివాసరావుతో పాటు మోపిదేవి మండల రెవెన్యూ అధికారి కె.నవీన్‌కుమార్, సీఐ ప్రసాద్ పాల్గొన్నారు.