జీవితంలో విజయం సాధించాలంటే కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, అంకితభావంతో కూడిన కష్టం, పట్టుదల ఉండాలి. సున్నా నుంచి శిఖరానికి చేరడం ఎలాగో నిరూపించిన గొప్ప వ్యక్తి సావ్జీ ధోలాకియా.కేవలం 12 రూపాయలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన కథ ప్రతి ఒక్కరికీ ఒక పాఠం. పేదరికం నీ ఎదుగుదలని ఆపలేదని, లక్ష్యం వైపు నిజాయితీగా అడుగులు వేస్తే విజయం వరిస్తుందని ఆయన జీవితం నిరూపిస్తుంది. కష్టపడే తత్వం ఉంటే సామాన్యుడు కూడా అసామాన్యుడిగా మారవచ్చని చెప్పడానికి ఈయన ఒక గొప్ప ఉదాహరణ.గుజరాత్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సావ్జీ ధోలాకియా, చదువు మధ్యలోనే ఆపేసి కేవలం 13 ఏళ్ల వయసులో సూరత్ చేరుకున్నారు. అప్పట్లో ఆయన దగ్గర ఉన్నది కేవలం 12 రూపాయలు మాత్రమే. అది కూడా తను పుట్టిన ఊరిలో అప్పు చేసి మరీ తెచ్చుకున్నాడు. తన మామ వద్ద వజ్రాలకు మెరుగులు దిద్దే పనిలో చేరి, ఆ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. సుమారు పదేళ్ల పాటు ఎంతో కష్టపడి పని నేర్చుకున్న తర్వాత, 1992లో తన సోదరులతో కలిసి ‘హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్’ అనే సంస్థను స్థాపించారు.మొదట్లో చిన్నగా మొదలైన ఈ వ్యాపారం, ధోలాకియా కష్టపడే తత్వంతో అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నేడు ఆయన సంస్థ విలువ సుమారు 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఆయన కంపెనీ వజ్రాలు ప్రపంచంలోని ఎన్నో దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.సావ్జీ ధోలాకియా కేవలం డబ్బు సంపాదించడమే కాదు, తన దగ్గర పనిచేసే ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. తన కంపెనీ అభివృద్ధికి కారణమైన ఉద్యోగులకు దీపావళి కానుకగా వందలాది కార్లు, ఇళ్లు, ఖరీదైన నగలు బహుమతిగా ఇచ్చి దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు కూడా వాటా ఉండాలని ఆయన నమ్ముతారు.వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవలో కూడా ఆయన ముందుంటారు. చెరువుల నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. దీనికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. 12 రూపాయలతో మొదలై 15 వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆయన ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప స్ఫూర్తి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa