విజయవాడలో రెండు రోజుల క్రితం జరిగిన టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకలో ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. రాధాకు అభినందనలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు అక్కడ తోపులాట జరిగింది. ఈ తోపులాట సమయంలో అక్కడే ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ వస్తే ఇలానే ఉంటుందని.. ఆయన రేంజ్ ముందు కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు నిలబడలేరని జనసైనికులు, పవర్ స్టార్ అభిమానులు ట్రోల్ చేశారు.
అయితే, ఈ తోపులాటకు ముందు ఏం జరిగిందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పవన్ కళ్యాణ్, కొడాలి నాని కరచాలనం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బౌన్సర్ల వలయం మధ్యలో వంగవీటి రాధాకు అభినందనలు చెప్పడానికి పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు.. ఆయనకు ఎదురుగా జనం మధ్యలో కొడాలి నాని ఉన్నారు. పవన్ కళ్యాణ్‌ను చూసిన వెంటనే నాని రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టారు. నానీకి పవన్ కళ్యాణ్ నవ్వుతూ ప్రతినమస్కారం చేశారు. ఆ తోపులాట మధ్యనే కొడాలి నానీతో పవన్ కళ్యాణ్ కరచాలనం చేశారు. ఈ వీడియోను కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులే వైరల్ చేస్తున్నారు.
శత్రువులను కూడా ప్రేమగా పలకరించే గుణం మెగా బ్రదర్స్‌ది అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఎంత రాజకీయ ప్రత్యర్థులైనా ఇలాంటి శుభకార్యాల్లో ఒకరినొకరు పలకరించుకోవడం సాధారణమేనని మరికొందరు అంటున్నారు. అయితే, కొంత మంది జనసైనికులు మాత్రం కొడాలి నానీకి పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చిన కొడాలి.. రేపు మళ్లీ ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్‌ను తిడతారని అంటున్నారు.
ఇదిలా ఉంటే, వంగవీటి రాధాకృష్ణకు కొడాలి నాని, వల్లభనేని వంశీ మంచి మిత్రులు. పార్టీలు వేరైనా వీరి స్నేహం మాత్రం అలానే కొనసాగుతోంది. అందుకే మిత్రుడి పెళ్లిని దగ్గరుండి నాని, వంశీ జరిపించారట. ఇక ఈ పెళ్లికి అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా పలకరించారని అంటున్నారు. కాగా, ఏలూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లిని వంగవీటి రాధా పెళ్లి చేసుకున్నారు. ఆదివారం రాత్రి విజయవాడలోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్స్‌లో ఈ వివాహ వేడుక జరిగింది.