ఏపీ సర్కారు మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. మద్యం కంపెనీలపై ఆరోపణలు వస్తున్నాయని.. ఎప్పుడు చర్యలు తీసుకుంటారని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఏపీలోని డిస్టలరీస్ యజమానుల వివరాలు ఇవ్వగలరా అని తాము సవాల్ విసిరామని.. కానీ ప్రభుత్వం స్పందించ లేదన్నారు. ఏపీ బెవరెజెస్ కార్పొరేషన్ దగ్గర 100 డిస్టలరీ కంపెనీలు నమోదయ్యాయని.. కానీ 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయన్నారు. అదాన్ డిస్టలరీస్ 2019లో మొదలైందని.. రూ. 1164 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్ అదాన్ కంపెనీకే ఉన్నాయన్నారు.
అదాన్ కంపెనీ వెనుక వైఎస్సార్‌సీపీ ఎంపీ ఉన్నారని.. ఈ రెండు కంపెనీలను అదాన్ బలవంతంగా చేజిక్కించుకుందన్నారు. చింతకాయల రాజేష్, పుట్టా మహేష్ వంటి వారికి చెందిన సంస్థలను బలవంతంగా అదాన్ కంపెనీ చేజిక్కించుకుందన్నారు. ఎస్పీవై అగ్రోస్ సంస్థకు రూ. 1800 కోట్ల మేర సరఫరా ఆర్డర్ ఉన్నాయని.. ఈ సంస్థ వెనుక మిధున్ రెడ్డి ఉన్నారన్నారు. ప్రకాశం జిల్లాలో పెరల్ డిస్టలరీస్‌ను సీఎం జగన్ సన్నిహితులు బలవంతం పెట్టి సబ్ లీజుకు తీసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల జాబితా.. ఆ కంపెనీల ఓనర్ల జాబితా ఇవ్వమని అడిగితే ఇవ్వలేదన్నారు.
ఇప్పుడు తామే ఆ వివరాలు బయట పెట్టామని.. దశలవారీ మద్య నిషేధం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని పురందేశ్వరి గుర్తు చేశారు. మద్యం తయారీదారులని, అమ్మకం దారులని ఏడేళ్ల పాటు జైలుకు పంపుతామన్నారు. ఇప్పుడు మద్యం తయారీదారుల జాబితా విడుదల చేశాం.. వీరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలన్నారు. లెక్కల్లోకి రాని మద్యం డబ్బుల లెక్కలేవని ప్రశ్నించారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి మరీ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని ఆరోపించారు.
ఫోన్ పే.. గూగుల్ పే వంటివి మద్యం దుకాణాల్లో ఎందుకు కనిపించవని ప్రశ్నించారు పురందేశ్వరి. ఏపీ ఆన్‌లైన్ అనే యాప్ ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తామంటూ ప్రకటించారు కానీ.. అది పని చేయడం లేదని చెబుతున్నారన్నారు. మద్యం అవకతవకలపై విచారణ చేయించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరామని.. అలాగే ఏపీ ఆర్థిక స్థితిగతులపై నిర్మలా సీతారామన్ ను ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. పురందేశ్వరి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఏపీ ఆర్థిక పరిస్థితితో పాటూ మద్యం అంశంపై ఫిర్యాదు చేశారు.