వాయవ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు హమూన్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఇది అతి తీవ్ర తుఫాన్‌గా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం సాయంత్రానికి ఒడిశాలోని పారాదీప్‌నకు 330 కి.మీ.. పశ్చిమ బెంగాల్‌లోని దిఘా కు 290 కి.మీ., ఖేపుపరా, చిట్టగాంగ్ (బంగ్లాదేశ్) లకు వరసగా 190 కి.మీ., 305 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఇది ఈశాన్యం దిశగా కదులుతూ బలహీన పడి తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా మారుతుందని.. బుధవారం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్ అంచనా వేస్తోంది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండదని తెలిపారు.
మరోవైపు ఏపీలో ఎండల ప్రభావం కొనసాగుతోంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయంటోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఈ నెలాఖరులో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. కానీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. వాయుగుండం, తుఫాన్ ప్రభావం ఏపీపై లేకుండా పోయింది. అంతేకాదు ఈశాన్య రుతు పవనాల ప్రభావం కూడా రాష్ట్రంపై కనిపించడం లేదు.
మరోవైపు హమూన్ తుఫాన్ ప్రభావం మణిపూర్, త్రిపుర, మిజోరాం, అసోం, మేఘాలయ రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో 24, 25, 26 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలోకి మత్సకారులు వేటకు వెళ్లొద్దని.. రెండు రోజుల వరకు ఇవే హెచ్చరికలు కొనసాగుతాయని తెలిపింది వాతావరణ శాఖ. తుఫాన్ తీరం దాటే సమయంలో విధ్వంసం జరగొచ్చని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని.. సముద్రానికి దగ్గరలో ఉండే ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు.