విశాఖలో దసరా సందర్భంగా వైఎస్సార్సీపీ నేత స్థానికులకు కానుకల్ని అందించారు. దక్షిణ మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్ పలువురికి కోడి, మద్యం పంపిణీ చేశారు.విశాఖలోని డాబా గార్డెన్స్‌లో వైఎస్సార్సీపీ కార్యాలయం దగ్గరద మంగళవారం ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ పంపిణీ చేపట్టారు. పైగా.. గతంలో కేజీ మటన్ ఇచ్చామని.. ఈ ఏడాది కోడి, క్వార్టర్ మద్యం ఇస్తున్నట్లు చెప్పుకొన్నారు. దొడ్డి బాపు ఆనంద్ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 31, 32, 33, 34 వార్డులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా పది రోజుల క్రితం బాధ్యతలు చేపట్టారు.
ఆనంద్ సుమారు 120 మందికి వీటిని మంగళవారం అందించారు. అలాగే విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రస్తుతం విశాఖ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. దసరా సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి అర కిలో స్వీట్లు (లడ్డూలు) పంపిణీ చేశారు. నియోజకవర్గంలో సుమారుగా 80 వేల ఇళ్లు ఉండగా.. వార్డు వలంటీర్ల ద్వారా సోమవారమే వీటిని ఇంటింటికీ పంపిణీ చేయించారు. వార్డు కార్పొరేటర్లు, అధ్యక్షులు దగ్గరుండి ఈ కార్యక్రమం పర్యవేక్షించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్ కూడా ఎంపిక చేసిన కొంతమందికి కుక్కర్లు పంపిణీ చేశారని చెబుతున్నారు. మొత్తానికి దసరాకు జనాలకు నేతలు అదిరిపోయే గిఫ్టులు అందించారు.