ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఢిల్లీలో ప్రధానిని కలిసిన ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందించారు.
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కోరారు. ఆలయ కమిటీ స్వయంగా ఢిల్లీకి వచ్చిన తనను కలిసి ఇచ్చిన ఆహ్వానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అంగీకరించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీయే గతంలో శంకుస్థాపన వేయడం గమనార్హం. 2020 ఆగస్టు 5 వ తేదీన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా స్పందించారు. ఇవాళ ఎన్నో భావోద్వేగాలతో కూడిన రోజు అని పేర్కొన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు తనను కలిసేందుకు తన ఇంటికి వచ్చారని చెప్పారు. శ్రీ రామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా తనను ఆహ్వానించినట్లు తెలిపారు. రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని.. తన జీవిత కాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం తన అదృష్టమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయిన తర్వాత శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ మీడియాతో మాట్లాడారు. 2024 జనవరి 22 వ తేదీన అయోధ్య రామ మందిర గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. జనవరి 14 వ తేదీ మకర సంక్రాంతి తర్వాత రామలల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి.. 10 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించినట్లు చెప్పారు. ఇక మూడంతస్తుల్లో నిర్మిస్తున్న అయోధ్య రామాలయ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా ఇటీవల తెలిపారు.