పుల్వామా దాడులు, అదానీ వ్యవహారం, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన, అగ్నివీర్ సహా వివిధ అంశాలపై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ క్రమంలోనే చాలా విషయాల గురించి ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ.. ఈ సమావేశం కారణంగా తమపై ఈడీ, సీబీఐల ప్రమేయం పెరుగుతుందా అంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
సత్యపాల్ మాలిక్‌తో ప్రస్తుత, గత విషయాల గురించి మాట్లాడినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితుల గురించి చర్చించినట్లు తెలిపారు. దీంతోపాటు అదానీ వ్యవహారం గురించి కూడా భేటీలో మాట్లాడినట్లు పేర్కొన్నారు. 3 సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో ఏడాదిపాటు రైతులు చేసిన నిరసన, అగ్నివీర్ వ్యవస్థ వంటి అంశాలపై సత్యపాల్ మాలిక్‌తో ఆసక్తికరమైన చర్చ జరిగిందని రాహుల్ గాంధీ చెప్పారు.
ఈ చర్చలోనే సత్యపాల్ మాలిక్ రాజకీయ జీవితం గురించి రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. 1973 నుంచి రాజకీయ జీవితంలో ఉన్నానని సత్యపాల్ మాలిక్ చెప్పారు. ఈ సందర్భంగానే జమ్మూ కాశ్మీర్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ను సైన్యం గానీ.. భద్రతా బలగాలు గానీ నిర్వహించలేవని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌కు వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలని సూచించారు. ఆర్టికల్ 370 రద్దు కన్నా.. రాష్ట్ర హోదా తీసేయడమే కాశ్మీర్ వాసులను ఎక్కువగా బాధించిందని సత్యపాల్ మాలిక్ తెలిపారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు అప్రమత్తంగా ఉన్నారని.. చాలా ప్రాంతాల్లో ఉగ్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఇక పుల్వామా విషయంలో తాను హెచ్చరికలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని సత్యపాల్ మాలిక్ రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించారు. పుల్వామా దాడిని ఓట్ల కోసం ఉపయోగించుకున్నారని పరోక్షంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్ వాహనాన్ని ఢీకొట్టి.. ఈ ఘటనకు ప్రధాన కారణమైన వాహనం.. అంతకుముందు 10 రోజులుగా అదే ప్రాంతంలో తిరిగిందని తెలిపారు. ఆ వాహనాన్ని తనిఖీలు చేసినవారే లేరని.. దాని డ్రైవర్, యజమానికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఘటనకు ముందే వారిని అరెస్ట్ చేసి విడుదల చేశారని వివరించారు. అయితే వారు ఇంటెలిజెన్స్ రాడార్‌లో లేరని.. పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలు తెప్పించారని సత్యపాల్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు.
ఇక అదానీ గురించి కూడా రాహుల్, సత్యపాల్ మాలిక్ మధ్య చర్చ జరిగింది. రైతుల వద్ద నుంచి పంటలు కొనేందుకు అదానీ పెద్ద గోడౌన్స్ నిర్మించారని తెలిపారు. ఈ కారణంగానే కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హమీని నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. అదానీ పేరు ప్రభుత్వంతో మారుమోగిపోతోందని దేశంలోని ప్రతీ గ్రామంలో అదానీ వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నారని సత్యపాల్ మాలిక్ తెలిపారు. ప్రభుత్వం డబ్బు అంతా అదానీ వద్ద ఉందని ప్రజలు అంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో జాతుల మధ్య చెలరేగిన హింసపై మాట్లాడిన సత్యపాల్ మాలిక్.. పరిస్థితులను నియంత్రించేందుకు ప్రభుత్వం వద్ద నియంత్రణ లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదని సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు.