సింహాచలం అప్పన్న ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలోకి శునకం ప్రవేశించింది. ఉదయం ఏడు గంటల సమయంలో సర్వదర్శనం క్యూలైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ఒక వీధి కుక్క బేడా మండపం వరకు చేరుకుంది. అర్చకులు, సిబ్బంది గమనించి దానిని బయటకు తరిమేశారు. దీంతో రెండు గంటలపాటు భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.. ఆలయంలో అర్చకలు, సిబ్బంది సంప్రోక్షణ చేసిన తర్వాత మళ్లీ దర్శనానికి అనుమతి ఇచ్చారు. నీలాద్రి గుమ్మం వరకు శునకం ప్రవేశించిందని భక్తులు చెబుతున్నారు. సిబ్బంది నిర్లక్షం వల్లే వీధి కుక్క ఆలయంలోకి వచ్చిందని భక్తుల ఆరోపిస్తున్నారు.
దర్శనాలు నిలిపి వేయటంతో భక్తులు రెండు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. వాస్తవానికి ఆలయ ప్రాకారం చుట్టూ, అన్ని ద్వారాల వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అయినప్పటికీ ఓ వీధి కుక్క ఉత్తర గోపురం, ప్రధాన ద్వారం దాటుకుని ఏకంగా ఆస్థాన మండపం వరకు చేరుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం వేళ సెక్యూరిటీ సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.
మరోవైపు సింహాచలం ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి జమ్మివేట ఉత్సవం నిర్వహించారు. చేతిలో విల్లంభులు ధరించి.. పట్టు పీతాంబరాలు, ఆభరణాలతో శ్రీరామ చంద్రుడి అవతారంలో అప్పన్న స్వామిని భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని శ్రీరామా అతారంలో అలంకరించి పల్లకిలో అధిష్ఠింపజేయగా.. పండితులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ సపరివార సమేతంగా సింహగిరిపై నుంచి మెట్లమార్గంలో కొండ దిగువకు తరలివచ్చారు.
తొలి పావంచా అధికారులు, గ్రామస్థులు స్వామివారికి ఘన స్వాగతం పలకగా.. అడివివరం ప్రధాన రహదారిలో ఊరేగింపుగా వెళ్లి పైడితల్లి అమ్మవారిని పలకరించి పూలతోటలోని ఉద్యానమండపానికి చేరుకున్నారు. శమీపూజోత్సవంలో భాగంగా తోటలోని జమ్మిచెట్టుకు అర్చకులు పూజలు చేశారు. ఉత్సవం అనంతరం స్వామిని మెట్లమార్గం గుండా సింహగిరికి చేర్చి ఆరాధన, పవళింపు సేవలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గోవింద నామాలతో సింహగిరి వైకుంఠాన్ని తలపించింది.