అనకాపల్లి జిల్లాలో ఓ ఎద్దు బావిలో పడిపోయింది. విషయం తెలియడంతో స్థానికులంతా బావి దగ్గరకు వచ్చారు. జేసీబీ సాయంతో అతి కష్టం మీద ఎద్దును బావిలో నుంచి బయటకు తీశారు.. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాయకరావుపేట మండలం పాల్తేరులో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన బాబులు అనే రైతు వద్ద ఉంటే ఎద్దు బావిలో పడిపోయింది. దీంతో స్థానికులంతా ఏకమై దాన్ని తాళ్లతో కట్టి పైకి తెచ్చేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. ఇక లాభం లేదనుకున్న స్థానికులు.. వెంటనే జేసీబీని బావి దగ్గరకు పిలిపించారు. జేసీబీ సాయంతో ఎద్దును అతికష్టం మీద బయటకు తీశారు. పచ్చిక మేసుకుంటూ వచ్చిన ఎద్దు అదుపుతప్పి బావిలో పడిపోయి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. చివరికి ఎద్దు ప్రాణాలతో బయటపడటంతో యజమాని కూడా సంతోషించారు. ఎద్దుకు స్వల్ప గాయాలు అయ్యాయి. బావిలో నుంచి ఎద్దును బయటకు తీసేందుకు సహకరించిన స్థానికులకు యజమాని ధన్యవాదాలు తెలిపారు.