అన్ని వర్గాల ఉన్నతికీ రాచబాట జగనన్న పాలన అని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ‘సంక్షేమ పథకాలను బీదలకు నేరుగా అందించలేకపోతున్నామని గతంలో ఓ ప్రధాన మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యలో ఉన్న వారు తినేస్తుంటే ఏమీ చేయలేక చేతులెత్తేశారు. కానీ, సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పైసా అవినీతి జరగకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లక్షల కోట్లు బీదల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. ఇలా అవినీతి రహిత సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక సీఎం వైయస్ జగన్ మాత్రమే. వైయస్ జగన్ పాలనలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వైయస్ఆర్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అధ్యక్షతన జరిగిన సభలో ధర్మాన ప్రసంగించారు. గత టీడీపీ పాలనలో పచ్చ జెండా కట్టిన వాడికి, జన్మభూమి కమిటీలకు, డబ్బులిచ్చిన వారికే పథకాలు అందేవని మంత్రి ధర్మాన చెప్పారు. ఇప్పుడు అర్హుడైతే చాలు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని వివరించారు. ఎక్కడా ఏ అధికారీ, వైయస్ఆర్‌సీపీ కార్యకర్త నయా పైసా లంచం అడిగిన దాఖలాల్లేవన్నారు. వందేళ్ల క్రితం బ్రిటిష్ హయాంలో జరిగిన భూసర్వేతో కలుగుతున్న అవస్థల నుంచి తప్పించడానికి తమ ప్రభుత్వం రీసర్వే చేపట్టిందన్నారు. ఏ రైతునూ సర్వే రాళ్లు, పాసు పుస్తకం కోసం ఒక్క రూపాయి కూడా అడగలేదన్నారు. ఇటువంటి పరిపాలనే కదా ప్రజలు కోరుకుంటారని చెప్పారు. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, యువతను నమ్మించి వంచించిన చంద్రబాబు ముఠాకు ఎవరైనా ఓట్లేస్తారా అని ప్రశ్నించారు.