కులోన్మాదంతో నాపై దాడికి యత్నించారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.... తెలంగాణలో ఈరోజు జరిగే ఒక నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు ఖమ్మం వెళ్లాను. రాజానగరంలో జక్కంపూడి రాజా సోదరుని వివాహానికి హాజరై ఖమ్మం వెళ్లేక్రమంలో నేను ప్రయాణించే కారుకు స్వల్ప ప్రమాదం జరిగింది. దాంతో పెద్దగా నేను ఇబ్బంది పడనప్పటికీ ఈరోజు ఉదయం నేను బస చేసి వస్తున్న హోటల్ ముందు మరో సంఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తమకు తాము చెప్పుకుంటూ.. నామీద కొందరు కులోన్మాదులు దాడికి ప్రయత్నించారు. దీనిపై కొన్ని పచ్చ మీడియా ఛానెళ్లు రకరకాల కథనాల్ని అల్లారు. ‘అంబటికి తెలంగాణలో నిరసన సెగ’ ‘ఖమ్మం ప్రజలు అంబటిపై తిరుగుబాటు’ అంటూ స్క్రోలింగ్ పెట్టుకున్నారు. అంతేగానీ, నామీద జరిగింది ‘దాడి’ అని మాత్రం ఆ ఛానెళ్లు చెప్పలేకపోయాయి అని తెలియజేసారు .