వర్షాకాలం ముగిసి, పనుల సీజన్ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. నగరాల్లో ఇప్పటికే కొనసాగుతున్న పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, ఒక డ్రైవ్ కింద తీసుకుని రోడ్లపై దృష్టిపెట్టాలని సూచించారు. నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని సీఎం ఆదేశించారు. సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్ చేసి.. వినియోగించేలా చూడాలన్న ముఖ్యమంత్రి. దీనివల్ల చాలావరకు తాగునీటిని ఆదా చేయగలుగుతామన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సమగ్రంగా సీఎం సమీక్షించారు.