తన ప్రాణాలు పోతున్నాయని తెలిసినా తన బస్సులో ప్రయాణిస్తున్న 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ఓ బస్సు డ్రైవర్ హ్యాట్సాఫ్ అనిపించుకున్నాడు. వేగంగా వెళ్తున్న బస్సులోని డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో భారీ ప్రమాదం సంభవించే పరిస్థితి నెలకొంది. అయితే అప్పుడే చాకచక్యం ప్రదర్శించిన ఆ బస్సు డ్రైవర్.. వేగంగా ఉన్న బస్సును సురక్షితంగా ఆపి అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేశాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. అది కూడా అర్ధరాత్రి సమయంలో జరగడంతో పెను ప్రమాదం నుంచి అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
మా లక్ష్మి ట్రావెల్స్‌కు చెందిన బస్సు రోజూ రాత్రి కంధమాల్ జిల్లాలోని సారన్‌ఘర్ నుంచి జి ఉదయగిరి మీదుగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు వెళ్తుంది. ఈ క్రమంలోనే రోజూ లాగే శుక్రవారం రాత్రి కూడా 48 మంది ప్రయాణికులతో బస్సు సారన్‌ఘర్ నుంచి భువనేశ్వర్‌కు బయల్దేరింది. ఆ బస్సుకు డ్రైవర్ సనా ప్రధాన్ ఉన్నాడు. ఈ క్రమంలోనే కంధమాల్ జిల్లాలోని పబురియా గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఆ బస్సు డ్రైవర్ సనా ప్రధాన్‌కు గుండె పోటు వచ్చింది. దీంతో అతనికి బస్సు నడపడం చాలా కష్టం అయింది. ఈ క్రమంలోనే తాను చనిపోతానని సనా ప్రధాన్‌కు అర్థమైంది. అయితే తాను నడుపుతున్న బస్సులో ఉన్న 48 మంది ప్రయాణికులను ఎలాగైనా సురక్షితంగా ఉంచాలని భావించిన సనా ప్రధాన్.. బస్సును ఏ విధంగానైనా ఆపాలని ప్రయత్నించాడు.
ఈ క్రమంలోనే బస్సు వేగాన్ని కంట్రోల్ చేసేందుకు రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టాలని భావించి.. బస్సు స్టీరింగ్‌ను అటు వైపు తిప్పాడు. దీంతో బస్సు వెళ్లి ఆ గోడను ఢీకొట్టి ఆగిపోయింది. దీంతో ఒక్కసారిగా బస్సు రోడ్డు పక్కకు వెళ్లి గోడను ఢీకొట్టడంతో అందులో ఉన్న ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అర్ధరాత్రి కావడంతో మంచి నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. వెంటనే డ్రైవర్ వద్దకు వెళ్లి చూడగా.. అతడు సీటులోనే పడిపోయి ఉన్నాడు. దీంతో ఆ డ్రైవర్ సనా ప్రధాన్‌ను ప్రయాణికులు స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండె పోటుతో చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. అనంతరం వేరే డ్రైవర్ సాయంతో ఆ బస్సును, అందులో ఉన్న ప్రయాణికులను గమ్యస్థానానికి పంపించారు. ఆ తర్వాత విషయాన్ని డ్రైవర్ సనా ప్రధాన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని వారికి అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయం బయటికి రావడంతో ఆ డ్రైవర్ పట్ల తీవ్ర ప్రశంసలు వస్తున్నాయి. చనిపోతూ కూడా 48 మంది ప్రయాణికులను కాపాడినందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.