కేరళలోని కోచి కలమసేరి ప్రార్థనా మందిరంలో ఆదివారం నాటి వరుస పేలుళ్లలో ఒకరు చనిపోగా.. మరో 36 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జెహోవాహ్ ప్రార్థనలు ముగిసిన కొద్ది నిమిషాల్లోనే మూడు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఉదయం 9.47 గంటలకు తొలి పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. అక్టోబరు 27న ప్రారంభమైన జెహూవాహ్ మూడు రోజుల ప్రార్థనల చివర రోజునే పేలుళ్లు జరగడం గమనార్హం. ప్రమాద స్థలిలో 2 వేల మందికిపైగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. పేలుళ్లకు ఐఈడీని ఉపయోగించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఓ టిఫిన్ బాక్సులో ఐఈడీలను అమర్చినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. పేలుళ్లపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కేరళ పోలీసులు నియమించనున్నారు. మరోవైపు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఢిల్లీ నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ టీమ్ కూడా కేరళకు బయలుదేరింది.
కలమసేరీ ఎంపీ హిబీ ఎడెన్ మాట్లాడుతూ.. ‘ప్రార్థనలకు వచ్చినవారు వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు.. చాలా దట్టమైన పొగలు.. తొక్కిసలాట జరిగింది.. పెద్ద పేలుడు తర్వాత చిన్న పేలుడు జరిగింది. స్థలం సీలు చేసిన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు’ అని అన్నారు. పేలుళ్లను ఓ దురదృష్టకర ఘటనగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. సీఎం విజయన్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, సోమవారం అఖిలపక్ష సమావేశానికి కేరళ సీఎం పిలుపునిచ్చారు. అటు, పేలుళ్ల ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీవ్ర గాయాలతో 10 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారని పోలీసులు తెలిపారు.