ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇక గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టడంతో అక్కడ ఉన్న పాలస్తీనీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కనీసం తినడానికి కూడా తిండిలేక ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గాజాలో ఉన్న ప్రజలు.. స్థానికంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటు చేసిన గోదాముల్లోకి చొరబడుతున్నారు. అందులో ఉన్న ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లిపోతున్నారు.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ అంతర్జాతీయ సంస్థలు మానవతా సాయం కోసం ఆహార పదార్థాల గోదాంలు ఏర్పాటు చేశాయి. అయితే భీకర దాడులతో ఆహారం కూడా దొరక్కుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వేలాది మంది పాలస్తీనా ప్రజలు.. గోదాంలలోకి చొరబడి ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. దేశం విడిచి బయటకు వెళ్లలేక.. అక్కడే సురక్షితంగా ఉండలేక 23 లక్షల మంది గాజా ప్రజలు నలిగిపోతున్నారు.
ఇజ్రాయెల్ హమాస్‌ల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో పరిస్థితులు నానాటికీ దిగజారిపోతున్నాయి. దీంతో గాజావాసులకు ఐక్యరాజ్యసమితికి చెందిన సహాయ, మానవతా విభాగం సేవలు అందిస్తోంది. పాఠశాలలను వసతి గృహాలుగా చేసి.. వేలాది పాలస్తీనా వాసులకు పునరావాసం కల్పించారు. అటు గాజావాసుల కోసం ఈజిప్టు నుంచి కూడా కొంత సహాయం అందుతోంది. ఈ క్రమంలోనే ఆకలికి తట్టుకోలేక వేలాది మంది ప్రజలు.. గోదాంల్లోకి చొరబడి గోధుమలు, పిండి, ఇతర ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సహాయ, మానవతా విభాగం వెల్లడించింది.
ఇలా గోదాముల్లోకి చొరబడటం ఆందోళనకరమని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ గాజా డైరెక్టర్ థామస్ వైట్ పేర్కొన్నారు. స్థానిక ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని చెప్పడానికి ఇది సంకేతమని తెలిపారు. యుద్ధ భయం, తిండి దొరకదనే ఆందోళన, సాయం చేయరనే నిరాశతో ఉన్న గాజావాసుల్లో ఇలాంటి పరిస్థితులకు కారణం అని చెప్పారు. ఈజిప్ట్ నుంచి వస్తున్న ఆహార పదార్థాలు సరిపడటం లేదని.. మార్కెట్లో కూడా ఏ పదార్థాలు దొరకడం లేదని వివరించారు. మరోవైపు ప్రత్యేక వసతి గృహాలు నిండిపోతున్నాయని.. సాధారణం కంటే 12 రెట్ల ప్రజలు ఎక్కువగా ఉంటున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.