చంద్రబాబు నాయుడుకు ఈరోజు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇచ్చిన బెయిల్ గానీ.. టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు చెప్పుకుంటున్నట్టుగా నిజం గెలిచినట్టు కాదని అందరూ తెలుసుకోవాలి అని సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఆయనకు మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ మాత్రమే. అంటే, కేవలం 30 రోజుల పాటు (నాలుగు వారాలు) కంటికి ఆపరేషన్ చేయించుకుని మరలా నవంబర్ 28న సాయంత్రం 5 గంటలలోగా చంద్రబాబు లొంగిపోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ఆయన కుటుంబ సభ్యులు ఒకవైపు, టీడీపీ నేతలు మరోవైపు చప్పట్లు కొట్టుకుంటూ.. సంబరాలు చేసుకుంటూ.. కేసులో నిజం గెలిచిందన్నట్లు ప్రచారం చేసుకోవడం సరికాదు. కేసు మెరిట్స్ మాట్లాడకుండా.. కేసు విచారణ ఆసాంతం జరగకుండానే మీరు నిజం గెలిచిందని ఎలా చెప్పుకుంటారు ..? అని అడుగుతున్నాను. గౌరవ న్యాయస్థానం మంజూరు చేసిన కండీషన్ బెయిల్ ఆర్డర్‌ను తెప్పించుకుని చదువుకోవడం మంచిదని వారికి తెలియజేసుకుంటున్నాను అని తెలియజేసారు.