నకిలీపత్రాలు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో జరిగిన భూఅక్రమాల కేసులో దర్యాప్తు వేగం పెంచాలని, నిందితులను త్వరగా అరెస్టు చేయాలని ఒంగోలు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. ఒంగోలు నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా జరిగిన భూ కుంభకోణాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సభ్యులతో బుధవారం రాత్రి ప్రకాశం భవన్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు 30 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ మలికగర్గ్ వివరించారు. మొత్తం 69 మందిని నిందితులుగా గుర్తించామని, వీరిలో 29మందిని అరెస్టు చేశామన్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయా అంశాలపై కలెక్టర్ మాట్లాడుతూ త్వరగా మిగతా వారిని అరెస్టు చేయాలని సూచించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. దర్యాప్తును పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ శాఖల సమన్వయంతో చేయాలని స్పష్టం చేశారు. ఈ అక్రమాలతో నష్టపోయిన వారు ముందుకొచ్చి అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమావేశంలో జేసీ డాక్టర్ కె.శ్రీనివాసులు, ఏఎస్పీ నాగేశ్వరరావు, సబ్‌కలెక్టర్ సేతుమాధవన్, ట్రైనీ ఐఏఎస్ శౌర్యమన్ పటేల్, ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ మరియదాసు, ఒంగోలు, దర్శి, మార్కాపురం, కనిగిరి డీఎస్పీలు కె.నారాయణస్వామిరెడ్డి, అశోక్‌వర్థన్, వీరరాఘవరెడ్డి, రామరాజుతోపాటు జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్రరావు, తహసీల్దార్ మురళి తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa