స్కిల్ డెవలప్మెంట్ అంశంలో టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకొన్న తరహాలోనే కేంద్రంలోని నౌకాయాన శాఖ సీమెన్స్ కంపెనీతో స్కిల్ శిక్షణకు ఒప్పందం కుదుర్చుకొంది అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తెలియజేసారు. ఈ శిక్షణ చాలా బాగుందని, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్ధలు ఇదే సంస్థ నుంచి ఇదే మాదిరి శిక్షణ కార్యక్రమాన్ని ఎంచుకొని ఉపయోగించుకొంటే మంచిదని ఆ శాఖ కార్యదర్శి అన్ని సంస్ధలకు లేఖ కూడా రాశారు. ఆ శాఖ కూడా సీమెన్స్‌తో 90-10 నిష్పత్తిలోనే ఖర్చు ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందం కుదుర్చుకొన్న కేంద్రంపై కూడా వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేస్తుందా? సీమెన్స్ సంస్థ తొంభై శాతం ఖర్చు భరించేలా నైపుణ్య శిక్షణను విద్యార్థులకు ఇప్పించడమే నేరమైతే కేంద్రం కూడా నేరం చేసినట్లే కదా? ఏపీ కంటే ముందు గుజరాత్, తర్వాత మరో ఐదు రాష్ట్రాలు ఇవే ఒప్పందాలు కుదుర్చుకొన్నాయి. ఇదే మాదిరిగా అమలు చేశాయి. ఒక్క వైసీపీ ప్రభుత్వానికే ఇందులో అవినీతి కనిపించింది. కక్ష సాధించాలన్న తాపత్రయం ఒకటే దీనికి కారణం’’ అని వ్యాఖ్యానించారు.