తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలంలో విషాదం జరిగింది. పొట్టకూటికోసం పనులు చేసుకునే కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుతాఘాతానికి గురైనాడు. వివరాల్లోకి వెళ్ళితే... చిన పొలమూరుకు చెందిన మేడిశెట్టి శ్రీను (50) గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. ఖాళీ సమయంలో కొబ్బరి కాయలు దింపునకు వెళతాడు. గురువారం ఉదయం గ్రామంలోని పెడపర్తి రోడ్డులో ఒక ఇంటి వద్ద కొబ్బరి కాయలు దింపేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కడానికి ఆకు అడ్డుగా ఉండడంతో గమనించకుండా వేలాడుతున్న ఆకును లాగ బోయాడు.అయితే అది అప్పటికే ప్రక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగపై పడి ఉండడంతో ఒక్కసారిగా విద్యుదాఘా తానికి గురై చెట్టుపై ఉండిపోయాడు.విద్యుదాఘాతం కారణంగా మోకు కాలిపోయింది.స్థానికులు గమనించి విద్యుత్ సబ్ స్టేష న్‌కు ఫోన్ చేసి సరఫరా నిలుపుదల చేయించారు.కొద్ది సేపు చెట్టుకు వేలాడిన శ్రీను మృతదేహం మోకు మొత్తం కాలిపోవడంతో చెట్టు కింద ఉన్న పంట బోదె లోకి జారిపోయింది.సమాచారం అందు కున్న ఎస్‌ఐ జగదీశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించారు.విద్యుత్ శాఖ ఏఈ వీరభద్రరావుతో చర్చించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.మృతుడి కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.