ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే పాప విముక్తి.. రుజువు కోసం సర్టిఫికేట్ ఇస్తున్న ఆలయం

national |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2023, 10:34 PM

హిందూ మతాచారాలను అనుసరించి గంగలో మునిగితే పాపపరిహారం జరుగుతుంది. గంగా జలం మోక్ష ప్రదాయని అని నమ్మిక. గంగలో మునకేసినంత మాత్రాన చేసిన పాపాలు తొలగిపోతాయా? అని హేతువాదులు ప్రశ్నిస్తుంటారు. అయితే, ఓ ఆలయం మాత్రం మా పుష్కరిణిలో స్నానం చేస్తే.. మీ పాపం పరిహారమవుతోందని ఢంకా బజాయించి చెబుతోంది. అంతేకాదు, మేము అందుకు సర్టిఫికెట్ కూడా అందజేస్తామని అంటోంది. ఇందుకు రూ.12 చెల్లించాలని తీసుకుంటోంది. అదే దక్షిణ రాజస్థాన్‌లోని గౌతమేశ్వర్ మహాదేవ్ ఆలయం. రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఉన్న ఆలయ పరిసరాల్లోని కోనేరు వాగడ్‌ హరిద్వార్‌గా పేరు గాంచింది. ఏటా ఇక్కడ గల మందాకిని కుండ్‌లో పవిత్ర స్నానం చేసిన 250 నుంచి 300 మందికి మాత్రమే పాప విముక్తి ధ్రువపత్రాలను దేవస్థానం అందజేస్తోంది. అయితే, ఈ ఆచారం ఎప్పటి నుంచి కొనసాగుతుందన్నది స్పష్టంగా తెలియదు.


ఆలయ పూజారి వికాశ్ శర్మ మాట్లాడుతూ.. దేవాలయ విశిష్టత గురించి వివరించారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంపై దాడిచేసిన మహమ్మద్ గజనీ.. ఆలయంలోని విగ్రహాల్ని ధ్వంసం చేయడానికి చేశాడు. దీంతో శివలింగం చుట్టూ పగుళ్లు, పైన రంధ్రం ఏర్పడిందని చెప్పారు. ఆ సమయంలో తేనెటీగల గుంపు సైన్యంపై దాడి చేసింది. ఆ ఆపద నుంచి వారు ప్రాణాలతో తిరిగి రావాలని ప్రార్ధించగా.. అల జరిగినందుకు ఆలయాన్ని మళ్లీ నిర్మించాడని అన్నారు. ఏదైనా జంతువును అనుకోకుండా లేదా ప్రయత్నపూర్వకంగా చంపినవాళ్లు, కుల లేదా వర్గ బహిష్కరణకు గురైన వ్యక్తులు ఆ కుండ్లో స్నానం చేసి పాప విముక్తి సర్టిఫికెట్ పొందుతుంటారు. దానిని పంచాయతీ పెద్దలకు చూపించి, ఎటువంటి పాప భారాన్ని మోయడంలేదని నిరూపించుకుని శిక్ష నుంచి బయటపడుతుంటారు.


గోహత్యాపాతకం నుంచి విముక్తి కోసం గౌతమ మహర్షి మందాకిని కుండ్‌లోనూ స్నానం చేశారని, అదే ప్రాంతంలో శివలింగం ఆవిర్భవించిందని స్థల పురాణం చెబుతోంది. స్థానిక గిరిజనులు.. తమ కుటుంబసభ్యుల చనిపోతే వారి చితాభస్మాన్ని మందాకిని కుండ్లోనూ నిమజ్జనం చేస్తారని, అందుకే ఈ క్షేత్రాన్ని హరిద్వార్ ఆఫ్ వాగడ్గా పిలుస్తారని ఓ పూజారి తెలిపారు. సోషల్ మీడియా వల్ల ఈ ఆలయం ఇటీవలే బాగా ప్రాచుర్యం పొందిందని సర్పంచ్ ఉదయ్ లాల్ అన్నారు. శ్రావణమాసం, సోమవారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. రాజస్థాన్ పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌ నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com