దేశవ్యాప్తంగా వంట పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడం, శక్తి సామర్థ్యం వినియోగంపై ప్రాముఖ్యత, ఆవశ్యకతలను తెలియజేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంలోని విభాగాలు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్) ఆధ్వర్యంలో నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ)ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈఈఎస్‌ఎల్ దేశవ్యాప్తంగా ఒక కోటి సమర్ధవంతమైన బీఎల్‌డీసీ ఫ్యాన్‌లు, 20 లక్షల సమర్థవంతమైన ఇండక్షన్ కుకింగ్ స్టవ్‌లను పంపిణీ చేయనుంది.
నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ)లో భాగంగా ఇండక్షన్ ఆధారిత కుకింగ్ స్టవ్‌లు అందించనున్నారు. అయితే సాధారణంగా వంట చేసే గృహోపకరణాలతో పోల్చితే సుమారు 25 నుంచి 30 శాతం ప్రయోజనాలను అందిస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటితో పాటు కరెంట్ ఆదా కావడంతోపాటు తక్కువ ఖర్చుతో మంచి వంటను చేసుకోవచ్చని పేర్కొన్నాయి. దేశం అంతట ఈ ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించడం వల్ల ముఖ్యంగా పర్యావరణం కాలుష్యం కాకుండా ఉంటుందని తెలిపాయి. ఈ ఇండక్షన్ కుకింగ్ స్టవ్‌లను ఈఈఎస్‌ఎల్, మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్(ఎంఈసీఎస్)ల పార్ట్‌నర్‌షిప్‌తో దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో కిచెన్‌లో ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాలు పెరగడంతోపాటు వంట పద్ధతుల్లో కూడా భారీ మార్పులు వస్తాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ తెలిపారు. తక్కువ ఆదాయం గల కుటుంబాలకు ఈ స్టవ్ చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఇక ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ) తక్కువ కరెంటు వినియోగంతోపాటు.. పర్యావరణానికి మేలు కలిగించే సీలింగ్ ఫ్యాన్‌లను తయారు చేశారు. ఈ ఫ్యాన్ వల్ల విద్యుత్ బిల్లు కూడా తక్కువగానే వస్తోందని పేర్కొన్నారు. సాధారణంగా ఉపయోగించే విద్యుత్ వినియోగంలో 35 శాతం తగ్గించే లక్ష్యంతో ఈ ఆధునిక ఫ్యాన్‌లను ఈఈఎస్‌ఎల్ తీసుకొచ్చింది. గతంలో ఎల్‌ఈడీ బల్బులను తీసుకొచ్చిన ఈఈఎస్ఎల్.. ప్రతి ఇంటికీ వాటిని చేర్చేలా చేసింది. మళ్లీ అదే ప్రయత్నం చేసి మరోసారి అలాంటి ప్రయత్నం చేసి ఈ ఆధునాత ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్‌లు, ఇండక్షన్ స్టవ్‌లను తీసుకొచ్చింది. ఈ ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్ వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని.. దీంతోపాటు 12 గిగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను నిరోధించగలమని పేర్కొన్నారు. వినియోగదారులకు కూడా విద్యుత్ బిల్లు తక్కువగానే వస్తుందని తెలిపారు. ఇది ప్రభుత్వంపై విద్యుత్ భారంతోపాటు ప్రజలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.