వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వమని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి సామాజిక సమతుల్యత పాటిస్తూ సీఎం వైయస్ జగన్ పాలన కొనసాగుతోందన్నారు. శృంగవరపుకోటలో సామాజిక సాధికార బస్సు యాత్రను వైయస్‌ఆర్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు ప్రారంభించారు. ఎస్.కోటలో బస్సు యాత్ర ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. వైయస్‌ఆర్ సీపీ ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేస్తోందని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ భరోసాను సీఎం వైయస్ జగన్ కల్పించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఆర్థిక చేయూత అందించి వారి కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేశారని చెప్పారు. సామాజిక సమతుల్యత పాటిస్తానని సీఎం వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలోనే మాటిచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారన్నారు.