ఏపీలో సీఎం జగన్ పాలనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పిచ్చోడి పాలన ఫలితం...ప్రజారోగ్యం గాలిలో దీపం... అంటూ వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్ల జగన్మోహన్ రెడ్డి అసమర్థపాలన రాష్ట్ర ప్రజలకు శాపమైందన్నారు. ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారిందని అన్నారు. నాగార్జునసాగర్ సమీపాన గల విజయపురి సౌత్ కమ్యూనిటీ ఆసుపత్రి ప్రాంగణంలో చెట్లకింద రోగుల దుస్థితి జగన్ చేతగాని పాలనకు అద్దం పడుతోందన్నారు. నల్లమల అటవీప్రాంతంలో గిరిజనతాండాల ప్రజలకు ఏకైక దిక్కుగా ఉన్న ఈ ధర్మాసుపత్రిలో మూడేళ్లుగా చెట్లకిందే వైద్యసేవలు అందిస్తున్నారంటే ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలని ఆయన తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యమంత్రి సొంతజిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలాంటి మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇక ఆ దేవుడేదిక్కని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆక్సిజన్ సరఫరా వైఫల్యం కారణంగా కళ్లెదుటే వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూశామన్నారు. జగన్ దివాలాకోరు పాలన పుణ్యమా అని కర్నూలు, అనంతపురం వంటి బోధనాసుపత్రుల్లోనే దూది, గాజుగుడ్డ కూడా అందుబాటులో లేని దుస్థితి నెలకొందన్నారు. ‘‘రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు కళ్లెదుట కన్పిస్తుంటే రాజుగారి వంటిమీద దేవతావస్త్రాల మాదిరిగా తమ హయాంలో వైద్య, ఆరోగ్యరంగం వెలిగిపోతుందని, జగనన్న సురక్ష పేరుతో ఇళ్లవద్దకే వెళ్లి వైద్యసేవలు అందిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రిని పిచ్చోడుగాక మరేమనాలి?!’’ అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.