ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుసగా ఆరో రోజు దారుణంగా వాయు నాణ్యత,,,,,విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Sun, Nov 05, 2023, 10:17 PM

దేశ రాజధాని ఢిల్లీ నగరం వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి మించిపోవడంతో ప్రజలకు ఊపిరి సలపడం లేదు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు. పొరుగున ఉన్న హరియాణా, పంజాబ్‌లో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడంతో పాటు శీతాకాలం పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరో ఐదు రోజుల పాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. 6-12 తరగతుల పాఠశాలలు మూసివేయాల్సిన అవసరం లేదని.. ఒకవేళ అవసరమైతే ఆన్‌లైన్ తరగతులు నిర్వహించుకోవాలని సూచించింది.


ప్రాథమికంగా నవంబరు 5 వరకూ పాఠశాలలకు ఢిల్లీ సర్కారు సెలవులను ప్రకటించింది. కానీ, పరిస్థితి మరింత దిగజారడంతో నవంబరు 10 వరకూ పొడిగించింది. ‘కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నందున ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలలు నవంబర్ 10 వరకు మూసివేస్తున్నాం... 6-12 గ్రేడ్ పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులకు మారే అవకాశం ఇస్తున్నాం’ అని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతీశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో వరుసగా ఆరో రోజు ఆదివారం ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 460గా నమోదయ్యింది.


ఊపిరితిత్తులలో లోతుగా చేరి ఆరోగ్య సమస్యలను కలిగించే పీఏం 2.5 కణాలు గత కొన్ని రోజులుగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ అంతటా అనేక ప్రదేశాలలో ప్రతి క్యూబిక్ మీటర్‌కు ప్రభుత్వం నిర్దేశించిన సురక్షిత పరిమితి 60 ఎంజీల కంటే ఏడు నుండి ఎనిమిది రెట్లు పెరిగాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే 80 నుంచి 100 రెట్లు ఎక్కువ. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం ప్రణాళిక ప్రకారం.. ఏక్యూఐ 450 దాటితే కాలుష్య ట్రక్కులు, వాణిజ్య ఫోర్-వీలర్లు, అన్ని నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం సహా అత్యవసర వాయు కాలుష్య నియంత్రణ చర్యలను అమలు తప్పనిసరి.


పడిపోతున్న ఉష్ణోగ్రతలు, కాలుష్య వ్యాప్తిని అణిచివేసే స్తబ్దత గాలులు, పంజాబ్, హరియాణాలో పంట కోత అనంతర వరి కంకులు తగులబెట్టడం వల్ల ఢిల్లీ-ఎన్సీఆర్ గాలి నాణ్యత గత వారం రోజులుగా క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) డేటా ప్రకారం.. ఢిల్లీ ఏక్యూఐ అక్టోబర్ 27- నవంబర్ 3 మధ్య 200 పాయింట్లకు పైగా పెరిగింది. శుక్రవారం అత్యంత తీవత్ర కేటగిరీకి (450 పైన) పడిపోయింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు 468 నుంచి శనివారం ఉదయం 6 గంటల మధ్య స్వల్ప మెరుగుదల కనిపించింది, అయితే, 2021 నవంబరు 12 తర్వాత తొలిసారి శుక్రవారం నాటి 24 గంటల సగటు వాయు నాణ్యత ఏక్యూఐ468కి పడిపోయింది. ఇక, ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన వాయు కాలుష్యం రాజధానిల్లో ఒకటిగా ఢిల్లీ నిలిచినట్టు యూనివర్సిటీ ఆఫ్ చికాగో నివేదిక పేర్కొంది. దీని కారణంగా ఢిల్లీ ప్రజల జీవితకాలం 12 ఏళ్ల తగ్గిపోతుందని హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com