ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తేనే పురోగతి వస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ బూత్ లెవల్ అధ్యక్షులతో పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు. ఏపీలో ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారని, వైసీపీకి నాలుగున్నరేళ్లుగా అవకాశం ఇచ్చారని, ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్ర పరిస్థితి నేడు ఎలా తయారైందో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ రెండు పార్టీల నేతలు తమ వర్గ, వ్యక్తిగత కక్షపూరిత రాజకీయాలతో గత పదేళ్లుగా కేసులు, జైళ్లు, బెయిళ్లతో పాలన చేశారని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారుతో రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.