గత నాలుగేళ్లలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల్ని ప్రజలకు వివరించడంతో పాటు అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వాళ్ల విషయంలో వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. నవంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ‘వై ఏపీ నీడ్స్ జగన్’పై అధికారులతో సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వం చేసిన మేలు గురించి ప్రధానంగా ప్రచారం చేయాలని అధికారుల్ని, సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. గ్రామాల వారీగా ఎంత డీబీటీ ఇచ్చాం, ఎంతమంది ఎలా లబ్ధి జరిగింది అనే దానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలి. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలి. గ్రామాలవారీగా ఎంత మంచి జరిగిందో చెప్పాలి. ఒకవేళ అర్హులకు ఏమైనా అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి.స్కూళ్లలో నాడు– నేడు ద్వారా వచ్చిన మార్పులు చెప్పాలి. ఆర్బీకేల్లాంటి వ్యవస్థతోపాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు గురించి చెప్పాలి. పారదర్శకత ఏరకంగా పాటిస్తున్నామో వివరించాలి. సోషల్ ఆడిట్ ద్వారా నాణ్యంగా అందుతున్న సేవల్ని వివరించాలి. దిశ యాప్ ద్వారా అందుతున్న సేవలు తదితర అంశాలన్నింటిపైనా చెప్పాలి. మొత్తంగా గత నాలుగున్నరేళ్లలో ఈ పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి వారికి తెలియజేయాలని అన్నారు.