ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని, అభివృద్ధిలో దూసుకెళ్తోందని చెంకలు గుద్దుకుని చెప్పుకుంటున్నాం. కానీ, కొన్నిచోట్ల ఎవరైనా చనిపోతే తరలించడానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేక.. ద్విచక్రవాహనాలు, భుజాలపై ఎత్తుకుని బస్సుల్లో మృతదేహాలను తీసుకెళ్తున్న ఘటనలు నిత్యం ఏదో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా, ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన తన సోదరి మృతదేహాన్ని ఓ యువకుడు బైక్‌పై తీసుకెళ్లాడు. గుండెల్ని పిండేసే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇదేనా అభివృద్ధి అని నిలదీస్తున్నారు.
ఔరైయా జిల్లాలోని నవీన్ బస్తీకి చెందిన ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20).. ఆన్ చేసి ఉన్న వాటర్ హీటర్‌ను ప్రమాదవశాత్తు తాకింది. విద్యుత్ షాక్‌కు గురైన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను బిధునా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ, దురదృష్టవశాత్తూ అప్పటికే అంజలి మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో సోదరి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య కేంద్రం సిబ్బందిని ఆమె సోదరుడు ఆయుష్ కోరాడు. అయితే, అక్కడ అంబులెన్స్ అందుబాటులో లేదని వైద్యులు నిరాకరించారు. చివరకు దిక్కుతోచని పరిస్థితుల్లో అంజలి మృతదేహాన్ని దుప్పటితో చుట్టి బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని.. వెనుక మరో సోదరిని కూర్చోబెట్టి, మధ్యలో అంజలి శవాన్ని చున్నీతో తన నడుము చుట్టుకుని బైక్ నడిపాడు. ఈ దృశ్యం స్థానికులను కంటతడిపెట్టింది. ఆ సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు.
ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు డాక్టర్ అవిచల్ పాండే, డాక్టర్ కృపారామ్‌లను సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో ఎవరైనా చనిపోతే.. మృతదేహాన్ని తరలించేందుకు వారి బంధువులు అంబులెన్స్ అడిగితే తప్పకుండా ఏర్పాటుచేయాలని స్థానిక సీహెచ్‌సీ సూపరింటిండెంట్ డాక్టర్ పాండే అన్నారు. మరోవైపు, యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ విమర్శలు గుప్పించింది. ‘యోగి ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ సేవలు ఇంత అధ్వాన్నంగా ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం.. సోదరుడు తన సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు’ అని ట్వీట్ చేసింది. కాగా, పలు రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి. ఏపీ, తెలంగాణల్లోనూ జరిగాయి.