జగన్ ప్రభుత్వం 94 కేంద్ర పథకాలకు రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడం వల్ల నాలుగున్నరేళ్లలో వేల కోట్లు రాష్ట్రం కోల్పోయిందని శాసన మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు తెలిపారు. వ్యవసాయం, ఆరోగ్యం, సాగునీటి ప్రాజెక్ట్‌లు, పింఛన్లు, పరిశ్రమల వంటి రంగాల్లో కేంద్ర ప్రయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయకపోవడం వల్ల వేల కోట్లు నష్టపోవాల్సి వస్తోందన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన చేస్తూ ఈ నాలుగున్నరేళ్లలో కేంద్రం నుంచి వచ్చిన రూ.71,449కోట్ల నిధులు దారి మళ్లించి, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘ప్రతి పథకం ముందు జగన్, వైఎస్సార్ పేర్లు చేర్చడాన్ని కేంద్రప్రభుత్వం తప్పుపట్టినా, జగన్ సర్కార్ తీర్చు మార్చుకోపోవడం వల్ల రూ.6వేల కోటన్లు కేంద్రం నిలిపివేసింది. మూల ధన వ్యయం కోసం రావాల్సిన రూ.4వేల కోట్లు నిలిచిపోవటానికి జగన్‌రెడ్డే బాధ్యుడు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కేంద్రం ఇచ్చిన రూ.3,084కోట్లు దారి మళ్లించారు. ఏడాదికి 5లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న జగన్ హామీని విస్మరించి, కేంద్రం ఇస్తున్న నిధుల్ని దారి మళ్లిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.