పౌరుషాల పల్నాడు గడ్డను అభివృద్ధి గడ్డగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని తెలిపారు. పల్నాటి సీమ రూపురేఖలను సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తూ పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గత పాలకులు ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రస్తుతం అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. ఏదైనా పని చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును దశలవారిగా మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం వరకు తీసుకెళ్తాం. ఈ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందింబోతున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో పాటు మహిళా సాధికారితకు కృషి చేశాం. రూ.2 లక్షల 40 వేల కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. డీబీటీ నాన్‌డీబీటీ ద్వారా రూ.4 లక్షల 10వేల కోట్లు అందించాం. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించామని సీఎం చెప్పారు.