సాంకేతిక అభివృద్ధి విషయంలో చైనా మరో సంచలనానికి తెరతీసింది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనా సంస్థలు సోమవారం ఆవిష్కరించాయి. సెకనుకు 1.2 టెరాబైట్ డేటాను ప్రసారం చేయగల సామర్ధ్యం దీని సొంతమని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం పేర్కొంది. ఈ వేగం ప్రస్తుత ప్రధాన ఇంటర్నెట్ మార్గాల కంటే పది రెట్లు ఎక్కువని తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ను సింఘువా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టాయి.
మొత్తం 3,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ నెట్‌వర్క్.. బీజింగ్, వుహాన్, గ్వాంగ్జూలను విస్తృతమైన ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా అనుసంధానం చేస్తుంది. సెకనుకు 1.2 టెరాబైట్‌ల (1,200 గిగాబైట్‌లు) డేటాను ప్రసారం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లు సెకనుకు కేవలం 100 గిగాబైట్ల వేగంతో పనిచేస్తాయి. అమెరికా ఇటీవలే సెకనుకు 400 గిగాబైట్ల వేగంతో 5జీ ఇంటర్నెట్‌ను ఆవిష్కరించింది.
ముఖ్యంగా బీజింగ్-వుహాన్-గ్వాంగ్జూ కనెక్షన్ చైనా భవిష్యత్తు ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగం. దశాబ్దం పాటు కొనసాగిన కార్యాచరణ, జాతీయ చైనా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్‌వర్క్ (సెర్నెట్) కృషికి ఫలితం ఇది. జులైలో యాక్టివ్ చేసిన ఈ ప్రాజెక్టును సోమవారం అధికారికంగా ప్రారంభించారు. నెట్‌వర్క్ అన్ని ఆపరేషనల్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసి, విశ్వసనీయంగా పనిచేసినట్టు అధికారులు తెలిపారు. హువాయి టెక్నాలజీస్ వైస్-ప్రెసిడెంట్ వాంగ్ లీ మాట్లాడుతూ.. నెట్‌వర్క్ నిజంగా ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇదో ఉదాహరణ అని అన్నారు. ‘ఇది కేవలం ఒక సెకనులో 150 హై-డెఫినిషన్ ఫిల్మ్‌లకు సమానమైన డేటాను బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది’ అని వివరించారు.
‘సూపర్‌ఫాస్ట్ లైన్ విజయవంతమైన ఆపరేషన్ మాత్రమే కాదు, చైనాకు ఇంకా వేగవంతమైన ఇంటర్నెట్‌ను నిర్మించడానికి అధునాతన సాంకేతికతను కూడా అందిస్తుంది’అని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ఎఫ్ఐటీఐ ప్రాజెక్ట్ లీడర్ వు జియాన్‌పింగ్ వ్యాఖ్యానించారు. సింఘువా యూనివర్సిటీకి చెందిన జు మింగ్‌వీ దీనిని సూపర్‌ఫాస్ట్ రైలు ట్రాక్‌తో పోల్చారు. అదే స్థాయిలో డేటాను తీసుకువెళ్లేందుకు 10 సాధారణ ట్రాక్‌ల అవసరాన్ని ఇది భర్తీ చేస్తుందని, ఫలితంగా మరింత ఖర్చుతో కూడుకున్న, నిర్వహించదగిన వ్యవస్థ ఏర్పడుతుందని వివరించారు. దీనికి అవసరమైన సిస్టమ్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అన్నీ దేశీయంగా తయారుచేసినట్టు ఆయన వెల్లడించారు.