గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫాలోకి ఇజ్రాయేల్ సైన్యాలు ప్రవేశించాయి. హమాస్ మిలిటెంట్లు ఈ ఆస్పత్రిని కమాండ్ సెంటర్‌గా వినియోగిస్తున్నారని ఆరోపిస్తోన్న ఇజ్రాయేల్.. యుద్ధ ట్యాంకులు, దళాలతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఇజ్రాయేల్ దళాలు, యుద్ధ ట్యాంకులు అల్ షిఫా ఆస్పత్రి అత్యవసర విభాగంలోకి ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ ఆస్పత్రిలోని హమాస్ దళాలను లొంగిపోవాలని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెచ్చరికలు జారీ చేసింది. అంతకుముందే, కచ్చితమైన సమాచారంతో లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది.
ఈ దాడికి వైద్య సిబ్బంది, అరబిక్ భాష తెలిసిన వారిని తమ వెంట తీసుకెళ్లినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అంతేకాదు, అల్-షిఫా ఆపరేషన్ కోసం దళాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించినట్లు వివరించింది. ఇజ్రాయేల్ దళాల ప్రవేశించడంతో ఆస్పత్రిలో పరిస్థితి మరింత దారుణంగా మారినట్టు సిబ్బంది వెల్లడించారు. హమాస్ ఆరోగ్య విభాగం ప్రతినిధి డాక్టర్ అల్ ఖుద్రా మాట్లాడుతూ... ఈ ఆస్పత్రిలో వేలాది మంది నిరాశ్రయులు తలదాచుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిశీలకులు ఈ ఆస్పత్రికి రావచ్చని ఆయన ఆహ్వానించారు.
ఇజ్రాయేల్ ఆపరేషన్‌కు 3 గంటల ముందు ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ ఆస్పత్రిలో 1500 మంది వైద్య సిబ్బంది, 7,000 మంది నిరాశ్రయులు ఉన్నారని అల్ ఖుద్రా చెప్పారు. ఆస్పత్రిలో నవజాత శిశువులు సహా 2,300 మంది రోగులు, సిబ్బంది చిక్కుకున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. అల్-షిఫాలోని మెడికల్ కాంపౌండ్‌లోకి ఇజ్రాయేల్ ట్యాంకులు ప్రవేశించాయని గాజాలోని ఆసుపత్రుల డైరెక్టర్ మొహమ్మద్ జకోట్ చెప్పారు.‘"బలగాలు భవనాలపైకి దూసుకెళ్లాయి. చిన్నారులతో సహా రోగులు భయాందోళనకు గురవుతున్నారు. వారు కేకలు వేస్తున్నారు.. ఇది చాలా భయానక పరిస్థితి... మేము రోగుల కోసం ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేం’ అని అన్నారు.
ఇజ్రాయేల్ దళాలు మాత్రం అల్-షిఫా ఆస్పత్రిలో సైనిక కార్యకలాపాలను 12 గంటల్లోనే మూసివేయాలని అల్టిమేటం జారీచేశామని.. దురదృష్టవశాత్తూ వారు అలా చేయలేదని పేర్కొన్నాయి. అల్-షిఫా ఆసుపత్రి వైద్య సిబ్బంది ప్రకారం.. మంగళవారం నాటికి 36 మంది నవజాత శిశువులను సంరక్షిస్తున్నారు. వారి తరలింపు కోసం ఇంక్యుబేటర్లను సరఫరా చేయడానికి ఇజ్రాయేల్ ప్రయత్నించినా.. స్పష్టమైన యంత్రాంగం లేదని చెప్పారు. అల్-షిఫా ఆసుపత్రిలో ఇంక్యుబేటర్‌లను కొనసాగించే పవర్ జనరేటర్‌లకు ఇంధనం అయిపోయినప్పటి నుంచి నెలలు నిండని ముగ్గురు శిశువులు మరణించారు.
మరోవైపు, అల్-షిఫా ఆస్పత్రిపై అమెరికా తొలిసారి సంచలన ప్రకటన చేసింది. ఆ ఆస్పత్రి కింద హమాస్ కమాండ్ సెంటర్ ఉందని తమకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని పేర్కొంది. ఈ మేరకు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ ప్రకటించారు. అల్-షిఫా ఆస్పత్రి కింద హమాస్ భారీగా ఆయుధాలను భద్రపర్చిందని ఆయన ఆరోపించారు. ఆ ఆస్పత్రిని చుట్టుముట్టిన తర్వాత తొలిసారి అమెరికా నుంచి ఇజ్రాయెల్ దళాలకు మద్దతు లభించడం గమనార్హం.