కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీ చాట్‌జీపీట్ ని రూపకర్త శామ్ ఆల్ట్‌మన్‌కు ఓపెన్ఏఐ సంస్థ ఝలక్ ఇచ్చింది. ఆయన సంస్థ సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారం ఉన్న ఓపెన్‌ఏఐ.. ఆయనను విశ్వసించకపోవడమే కారణమని ఒక ప్రకటనలో పేర్కొంది. శామ్ స్థానంలో తాత్కాలిక సీఈఓగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీకి బాధ్యతలు అప్పగించినట్టు తెలిపింది. శుక్రవారం సమావేశమైన ఓపెన్‌ఏఐ సంస్థ బోర్డు.. ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆల్ట్‌మన్ తొలగింపు నిర్ణయం టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
‘బోర్డులో జరుగుతున్న అంతర్గత చర్చల్లో ఆల్ట్‌మన్ నిజాయతీగా వ్యవహరించడం లేదు. సరైన సమాచారం పంచుకోవడం లేదు.. బోర్డు తీసుకునే నిర్ణయాలకు అడ్డుపడుతున్నాడు. ఓపెన్‌ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదు’ అని ఆ సంస్థ ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. కాగా, సీఈఓ బాధ్యతల నుంచి తనను తప్పించడంపై సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో స్పందించిన ఆల్ట్‌మన్.. ఓపెన్ఏఐ సంస్థలో పనిచేయడాన్ని తాను ఎంతగానో ఇష్టపడ్డానని చెప్పారు.
‘ఓపెన్‌ఏఐలో పనిచేయడాన్ని ఎంతో ఇష్టపడ్డాను. వ్యక్తిగతంగా నాకు, ప్రపంచాన్ని కొంచెం మార్చిందని నేను నమ్ముతున్నాను.. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో మంది ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం సంతోషాన్నిచ్చింది... తర్వాత ఏమి జరుగుతుందనే దాని గురించి మరింత చెప్పాల్సి ఉంటుంది.’ అని ఆయన పేర్కొన్నారు. చాట్‌జీపీటీని విడుదల చేయాలనే ఆల్ట్‌మన్ తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా ఫలించింది. ఈ స్టాన్‌ఫోర్డ్ డ్రాపౌట్‌కు స్టార్‌డమ్ తీసుకొచ్చింది. ఈ యాప్ కృత్రిమ మేధలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా సహా టెక్ దిగ్గజాలు ఇందులో పోటీదారులుగా ఉన్నారు. ఇటీవల కాలంలో దీనిని పరిచయం చేసినప్పుడు ప్రపంచమంతా నివ్వెరపోయింది. దీని సహాయంతో కేవలం సెకన్లలోనే మనకు కావాల్సిన కచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు.
అయితే, ఈ చాట్‌జీపీటీ వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అంతే సంఖ్యలో ఉన్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.ఆల్ట్‌మన్ సైతం ఏఐతో పెను ముప్పు పొంచి ఉందని చెప్పడం గమనార్హం. చాట్‌జీపీటీ కన్నా శక్తివంతమైన ఏఐని అభివృద్ది చేయగల సత్తా ఓపెన్‌ఏఐకి ఉన్నా.. ఇప్పటికిప్పుడే విడుదలకు తాము సుముఖంగా లేమని గతంలో ఆయన అన్నారు. యూజర్లు కూడా అందుకు సిద్ధంగా లేరని, తద్వారా తలెత్తే పరిణామాలను ఊహించడం కూడా కష్టమని గతంలో ఆల్ట్‌మన్ చెప్పారు. సిలికాన్ వ్యాలీలో ఇటీవల ప్రముఖ డెవలపర్ల సమావేశంలో శామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ, దాని విఘాతం కలిగించే శక్తుల గురించి ప్రజలు ఎలా భావిస్తున్నారనే విషయంలో తాను కొన్ని ఆందోళనలను అర్థం చేసుకున్నానని చెప్పారు.