హమాస్ మిలిటెంట్లను సమూలంగా నాశనం చేస్తామని శపథం చేసిన ఇజ్రాయేల్.. గాజాను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి దాడులు కొనసాగిస్తోంది. ఉత్తర గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. తాజాగా, దక్షిణ గాజాపై దృష్టిసారించింది. అక్కడ ఉన్న పాలస్తీనియన్లు తక్షణమే ఈ ప్రాంతాన్ని వీడి వెళ్లాలని హెచ్చరించింది. దక్షిణ గాజా నుంచి పశ్చిమ ప్రాంతానికి తరలివెళ్లాలని సూచించింది. దక్షిణ గాజాపైనా దాడులకు సిద్ధమైన ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్).. ఇప్పటికే అక్కడ కొన్ని ప్రాంతాలపై దాడులు మొదలుపెట్టింది.
‘దక్షిణ గాజాలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించాం. ఇది అంత సులభం కాదన్న విషయం మాకు తెలుసు. కానీ, తప్పదు.. ఎదురుకాల్పుల్లో పౌరులు చిక్కుకోకూడదని మేం భావిస్తున్నాం’ అని ఇజ్రాయేల్ అధికారి ఒకరు అన్నారు. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్‌లో 4 లక్షల వరకు పౌరులు ఉంటారు. వీరతోపాటు ఇజ్రాయేల్ దాడులతో ఇటీవల ఉత్తర గాజా నుంచి వేలాది మంది ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ప్రస్తుతం వీరందర్నీ పశ్చిమ ప్రాంతానికి వెళ్లిపోవాలని ఇజ్రాయేల్ హెచ్చరించింది. అక్కడైతే మానవతా సాయం సులువుగా పొందవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి వలసబాట పట్టక తప్పేలా లేదని పాలస్తీనీయులు భయాందోళనకు గురవుతున్నారు.
మరోవైపు, అల్-షిఫా సహా పలు ఆస్పత్రుల్లో ఇజ్రాయేల్ దళాల సోదాలు కొనసాగుతున్నాయి. గాజాలోని ప్రధాన ఆస్పత్రులను హమాస్ తమ కమాండ్ సెంటర్లుగా వినియోగించుకుంటోందని ఇజ్రాయేల్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలుగా పలు వీడియోలను విడుదల చేసింది. ఆస్పత్రుల నుంచి సొరంగాలకు దారులు ఉన్నాయని, రక్షణంగా బుల్లెట్ ప్రూఫ్ డోర్ల ఏర్పాటుచేశారని చెబుతోంది. ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారుజామున ఖాన్ యూనిస్ నగరంలోని ఓ ప్రాంతంపై ఇజ్రాయేల్ బాంబు దాడులకు తెగబడింది. ఈ ఘటనలో 26 మంది పౌరులు చనిపోయినట్టు పాలస్తీనా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందులో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్టు పేర్కొన్నాయి.