టీడిపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఊరట లభించింది. స్కిల్ కేసులో సోమవారం ఏపి హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఆగస్ట్ 9న స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఆరోగ్య సమస్యలతో నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు గురువారం (ఈనెల 17న) ముగియడంతో తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. తాజాగా సోమవారం బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.
చంద్రబాబు నవంబరు 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తన చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. కాగా, ఇవాళ తీర్పు సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్ వాదనకు ఆధారాల్లేవని హైకోర్టు అభిప్రాయపడింది. వాదనలను పరిశీలించిన అనంతరం జస్టిస్ టి.మల్లికార్జునరావు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించారు.