హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణపై వైఎస్సార్సీపీ సంచలన ఆరోపణలు చేసింది. తమిళ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ విచిత్ర చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా పార్టీ అఫిషియల్ పేజ్ నుంచి ఓ ట్వీట్ చేశారు. 'స్త్రీ లేకపోతే జననం లేదు.. గమనం లేదు.. సృష్టిలో జీవం లేదు.. అంటూ గొప్పగా సూక్తులు చెప్పే నందమూరి బాలకృష్ణ.. 2001లో భలేవాడివి బాసు సినిమా షూటింగ్ సమయంలో తమిళ హీరోయిన్ విచిత్రని లైంగికంగా వేధించాడట. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌లో స్వయంగా విచిత్ర చెప్పింది. గతంలో అమ్మాయిలు, నర్సుల గురించి కూడా బాలయ్య చాలా అసభ్యకర కామెంట్స్ చేశాడు. మహిళలను చులకనగా చూస్తూ కించపరచడం టీడీపీ నాయకులకి పరిపాటిగా మారిపోయింది'అంటూ ట్వీట్లో ప్రస్తావించారు.
బాలయ్య గతంలో ఎన్నో సందర్భాల్లో మహిళల గురించి చులకనగా మాట్లాడారని వైఎస్సార్సీపీ చెబుతోంది. గతంలో చేసిన కామెంట్స్‌ను కూడా ప్రస్తావించారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే టీడీపీ కార్యకర్తలు, బాలయ్య అభిమానులు కూడా ఈ ట్వీట్‌కు కౌంటర్ ఇస్తున్నారు. అసలు బాలకృష్ణ సినిమా అని కానీ, బాలయ్య అని కానీ పేరు ఎక్కడ ప్రస్తావించారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. విచిత్ర చేసిన కామెంట్స్‌కు సంబంధించి కొన్ని ఆర్టికల్స్లకు సంబంధించి స్క్రీన్ షాట్లను ప్రస్తావిస్తున్నారు. ఆమె ఎవరో తమిళ నటుడి గురించి ప్రస్తావిస్తే బాలయ్యకు ఏం సంబంధం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.