పేద కుటుంబాలకు పెళ్లిళ్లు భారంగా మారకూడదనే ఉద్దేశంతోనే వైఎస్సార్ షాదీతోఫా, కళ్యాణమస్తు పథకాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. క్యాంపు కార్యాలయం నుంచి లబ్దిదారులకు నిధులను విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ షాదీతోఫా, వైఎస్సార్ కళ్యాణ మస్తు నిధులను ముఖ్యమంత్రి లబ్దిదారుల ఖాతాలకు విడుదల చేశారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులకు ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 10,511 జంటలకు రూ.81.64 కోట్ల ఆర్ధిక ప్రయోజనాలను కల్పించారు. 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు మూడు విడతల్లో కళ్యాణమస్తు, షాదీతోఫా నిధులు అందించినట్టు సిఎం చెప్పారు.ప్రజలకు ఉపయోగపడేలా గత ప్రభుత్వం నిజాయితీగా, చిత్తశుద్ధితో పథకాలను తీసుకురాలేదన్నారు. ఒక పథకానికి మంచి ఉద్దేశం సంకల్పం ఉండాలని, అలా ఉంటే దానిని చేయడానికి అన్ని రకాల పరిస్థితులు కలిసి వస్తాయన్నారు.