విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ చేరింది. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్‌బాయ్ నాని.. హైకోర్టులో హాజరయ్యారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను వచ్చే సోమవారానికి ఎపి హైకోర్టు వాయిదా వేసింది.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న విశాఖ వన్ టౌన్ పోలీసులు.. అగ్నిప్రమాదంపై ఆరా తీశారు.. ఈ అగ్నిప్రమాదానికి నానియే కారణం అంటూ జోరుగా ప్రచారం జరగడంతో, అతడు మూడు రోజుల పాటు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే, నానిని అక్రమంగా పోలీసులు బంధించారని అతని స్నేహితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత పోలీసులు నానిని రిలీజ్ చేశారు. అయితే, తనపై తప్పుడు ప్రచారం చేశారని నాని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. హైకోర్టును ఆశ్రయించాడు. తనను అక్రమంగా నిర్బంధించారని విశాఖ పోలీసులపై పిటిషన్ దాఖలు చేశారు.