విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. తెలంగాణలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి వెలిసిన యాదాద్రి తరహాలో ఇంద్రకీలాద్రిని అభివృద్ధం చేయాలని సంకల్పించింది. దీనికోసం 225 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ప్రభుత్వం ముహూర్తాన్ని ఖరారు చేసింది. డిసెంబర్ 7వ తేదీన శంకుస్థాపన మొదలు కానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దేవాదాయ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఈ వివరాలను వెల్లడించారు.
విజయవాడ దుర్గగుడిని 225 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నామని, దీనికి అవసరమైన సమగ్ర ప్రణాళికను ఇదివరకే రూపొందించామని అన్నారు. అధికారులు రూపొందించిన డీపీఆర్‌ను ఆమోదించామని, ఇక పనులు మొదలు పెట్టబోతున్నామని వివరించారు. ఆ మరుసటి రోజున అంటే డిసెంబర్ 8వ తేదీన శ్రీశైలంలో చేపట్టే అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. దీని వ్యయం 125 కోట్ల రూపాయలు. 60 కోట్ల రూపాయలతో సింహాచలం, 80 కోట్ల రూపాయలతో అన్నవరం, 70 కోట్ల రూపాయలతో ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తామని అన్నారు.
కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాభివృద్ధికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను దేవాదాయ మంత్రిత్వ శాఖ ఇదివరకే రూపొందించింది. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ప్రసాదం పోటు, అన్న దానం భవన సముదాయం, శివాలయం అభివృద్ధి.. వంటి పనులన్నీ దీని పరిధిలోకి వస్తాయని కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఇప్పుడున్న క్యూ కాంప్లెక్స్‌కు అదనంగా మరో క్యూ కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తుంది. క్యూ లైన్ల కోసం ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తారు. అన్నదాన భవన సముదాయాన్ని రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేస్తారు. మొత్తంగా కనకదుర్గ, శ్రీశైలం, సింహాచలరం, అన్నవరం, ద్వారకా తిరుమల అభివృద్ధి కోసం ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను వ్యయం చేయనుంది.