భార్యా బిడ్డల్ని పాముకాటుతో చంపించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని జరిగిన ఈ ఘటనలో బంగారంలాంటి భార్యను..ముద్దులొలికే రెండేళ్ల కూతుర్ని పాముతో కాటేసి చంపేలా ప్లాన్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో గురువారం (23, 2023)న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గంజాం జిల్లాలోని అధెగావ్ గ్రామంలో గణేష్ పాత్ర అనే వ్యక్తి తన భార్య బసంతి నివసిస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితమే వివాహం జరిగింది. వీరికో పాప ఉంది. పాప పేరు దేబాస్మిత. చక్కటి సంసారం. కానీ ఎందుకో గణేష్ భార్యా పిల్లల్ని అత్యంత పాశవికంగా పాముతో కాటేసి చంపేలా ప్లాన్ వేశాడు. దానికి కోసం అక్టోబర్ 6న ఓ ప్లాస్టిక్ జార్ లో ఓ పామును పెట్టి పట్టుకొచ్చి భార్యా పిల్లలు నిద్రపోతున్న గదిలో వేశాడు. తాను మాత్రం వేరే గదిలో పడుకున్నాడు.
ఆ పాము ఇద్దరిని కాటు వేసింది. తెల్లారేసరికి ఇద్దరు చనిపోయి ఉన్నారు. దీంతో గణేశ్ ఏమీ తెలియనట్లుగా తన భార్యా పిల్లలు పాము కరిచి చచ్చిపోయారని ఏడ్చాడు. దీంతో అది పాముకాటుతో మరణించారని అందరు నమ్మారు. పోలీసులు కూడా అదే నమ్మారు. కానీ బసంతి తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దీంట్లో భాగంగా గణేశ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే పామును తీసుకొచ్చి వారి గదిలో వేశానని అంగీకరించాడు. అలా ఈ కేసు దర్యాప్తు జరిగిన నెలన్నర తరువాత నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణ కొనసాగుతోంది అని గంజాం జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుడు మామ ఫిర్యాదు చేయటంతో నిందితుడిని విచారించగా నేరం అంగీకరించాడని పోలీసు సూపరింటెండెంట్ జగ్మోమన్ మీనా తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.