రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కన్నూర్, కరిపూర్ విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగానే ఈ విమానాశ్రయాల విస్తరణ ఆగిపోయిందని మండిపడ్డారు. నవ కేరళ సదస్ కార్యక్రమం సందర్భంగా శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విమానాశ్రయాలను సమగ్రంగా అభివృద్ధి చేసి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
కేరళ ప్రవాసుల భూమి అని అంటూ వారు తమ స్వరాష్ట్రంతో అనుసంధానమయ్యేలా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. విమాన ఛార్జీలు తరచూ పెరుగుతున్నాయని, అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు అందుబాటులో లేవని పినరయి చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే కన్నూర్, కరిపూర్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. ప్రయాణికులను మలబార్ (ఉత్తర కేరళ) ప్రాంతానికి చేర్చే తొలి విమానాశ్రయం కలిపూరేనని, అయితే ఇప్పుడు దాని అభివృద్ధి ఆగిపోయిందని తెలిపారు.
కరిపూర్ విమానాశ్రయంలో రన్‌వే నిర్మాణానికి అవసరమైన భూమిని అక్టోబర్‌లోనే ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించామని, అయితే టెండర్ ప్రక్రియ కారణంగా జాప్యం జరుగుతోందని వివరించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి, రన్‌వే అభివృద్ధికి వాస్తవ రూపం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని అన్నారు. కన్నూర్ విమానాశ్రయం నిర్మాణం గత ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని, దానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అయినా కేంద్రం ఇప్పటికీ విదేశీ విమానాశ్రయాల రాకపోకలను అనుమతించడం లేదని విమర్శిం చారు. విమానాశ్రయాలపై నియంత్రణ కోసం, తమ ఇష్టానుసారం ఛార్జీలు నిర్ణయించుకునేందుకు కేంద్రం ప్రైవేటు కంపెనీలకు సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిపై ప్రేమ కురిపిస్తోందని ఆరోపించారు. అందుకే కన్నూర్ విమానాశ్రయం అభివృద్ధిని నిలిపివేశారని పినరయి చెప్పారు.