ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ.30 వేల కోట్ల విలువైన మూడు సెక్యూరిటీలను వేలం వేస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ‘7.37% ప్రభుత్వ సెక్యూరిటీ 2028’ని రూ. 7,000 కోట్లకు, ‘7.18% ప్రభుత్వ సెక్యూరిటీ 2033’ని రూ.13,000 కోట్లకు, ‘7.30% ప్రభుత్వ సెక్యూరిటీ 2053’ని రూ.10,000 కోట్లకు వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డిసెంబర్ 1న ముంబయిలోని ఆర్‌బీఐ కార్యాలయంలో ఈ వేలం జరుగుతుంది. ఈ మూడు సెక్యూరిటీలలో రూ.2,000 కోట్ల చొప్పున అదనపు సబ్‌స్క్రిప్షన్లను పొందే అవకాశాన్ని ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంది. ఆర్‌బీఐ కోర్-బ్యాంకింగ్ సొల్యూషన్స్ (ఈ-కుబేర్) ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. వేలం ఫలితాలను అదే రోజు ప్రకటిస్తారు. బిడ్లు దక్కించుకున్న వారు డిసెంబర్ 4న చెల్లింపులు జరపాల్సి ఉంటుంది.