కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చేసింది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్’గా మార్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసినట్టు అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పేరు మార్చిన తర్వాత ఆ ఫొటోలను ఆయుష్మాన్ భారత్-హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్(ఏబి-హెచ్ డబ్ల్యు సి) పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించినట్టు తెలిపారు. జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా 2018 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకం. ప్రయివేటు ఆస్పత్రుల్లో ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు వైద్యం అందించేందుకు ఉద్దేశించింది.