చిన్నారుల్లో పోషక విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వృద్ధి ప్రమాణాలను రూపొందించాలని భావిస్తోంది. అయితే దీనికి వాస్తవ రూపం వచ్చేందుకు అనేక సంవత్సరాలు పట్టవచ్చు. బరువు, ఎత్తుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచికలు మన దేశానికి అనువుగా లేవన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన దేశానికే పరిమితం చేస్తూ వృద్ధి ప్రమాణాలు రూపొందించాలని గత సంవత్సరం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)ని ఆదేశించింది. దీనిపై ఐసీఎంఆర్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం తాజాగా మరో ఆదేశాన్ని ఇచ్చింది. వృద్ధి ప్రమాణాలు రూపొందించడానికి బదులు 0-2 సంవత్సరాల మధ్య వయస్కులైన చిన్నారుల వృద్ధి నమూనాలపై ఐసీఎంఆర్ కమిటీ అధ్యయనం చేయాలని ఆదేశించింది. రెండు సంవత్సరాల వయసు దాటిన పిల్లలకు సంబంధించి ఆయా సమూహాల జనాభా సమాచారాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది.
అయితే ఈ అధ్యయనం ప్రొటోకాల్, వివరాలను ఇంకా ఖరారు చేయలేదు. చిన్నారుల్లో స్థానిక ప్రమాణాల రూపకల్పనకు అనేక సంవత్సరాలు పడుతుందని ప్రభుత్వాధికారులు అంటున్నారు. వ్యక్తిగత స్థాయిలో శిశువుల బరువు, ఎత్తును పిల్లల వైద్యులు నమోదు చేస్తారు. ఆ శిశువు సరిగా ఎదుగుతున్నాడా, కాలానుగుణంగా వృద్ధికి సంబంధించిన మైలురాళ్లను అధిగమిస్తున్నాడా అనే విషయాన్ని వారే పరిశీలిస్తుంటారు. ఈ అంశాలపై అధ్యయనం చేయాలంటే చాలా సమయం పడుతుందని అధికారులు తెలిపారు.