మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీకి అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. ఈనెల 17న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అయితే, ఈ ఎన్నికల్లో ప్రస్తుత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలోని దాదాపు 14 మంది మంత్రులకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేసిన ఐదుగురు మంత్రులదీ ఇదే పరిస్థితి అని తెలుస్తున్నది. డిసెంబర్ 3న విడుదలయ్యే ఫలితాల్లో వీరి భవితవ్యం తేలనున్నది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా 77 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
అయితే, క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారం, ఇన్‌పుట్‌ల ఆధారంగా ఈ సారి 14 మంత్రులపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదనీ, ఎన్నికల్లో వారు గెలవటం కష్టమేనని తెలుస్తున్నది. ఇందులో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన ఐదుగురు ఉండటం గమనార్హం. ఈ 14 మంది మంత్రుల జాబితాలో తొమ్మిది మంది క్యాబినెట్ మంత్రులు కాగా.. ఐదుగురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ నుంచి అధికారాన్ని చేజిక్కిచ్చుకున్న తీరు బీజేపీపై కోపాన్ని, కాంగ్రెస్‌పై సానుభూతిని తీసుకొచ్చిందని చెప్తున్నారు. అత్యధికంగా ఓటింగ్ నమోదు కావటమనేది ప్రభుత్వంపై వ్యతిరేకతకే కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.