ఎలుగుబంటి దాడిలో విశాఖ జూపార్క్ కీపర్ బానవరపు నగేశ్ (23) మృతి చెందడం కలకలం రేపింది. పార్క్ పరిసరాల్లో శుభ్రం చేస్తున్న యువకుడిపై నిన్న ఉదయం ఎలుగుబంటి ఒక్కసారిగా దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన నగేశ్‌ను జూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడిచేస్తుండడాన్ని చూసి సందర్శకులు హడలిపోయారు. ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన నగేశ్‌ది విజయనగరం జిల్లాలోని గజపతినగరం.
విశాఖ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రెండేళ్లుగా విశాఖ జూలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నగేశ్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించినట్టు జూ క్యురేటర్ నందిని సలేరియా తెలిపారు. నగేశ్‌పై దాడిచేసిన ఎలుగుబంటి ‘జిహ్వాన్’ను మిజోరం నుంచి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. బోనులో ఉండాల్సిన ఎలుగుబంటి బయటకు ఎలా వచ్చిందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బోను తలుపులు ఎవరైనా తీశారా? లేదంటే, సరిగా వేయకపోవడంతో వాటంతట అవే తెరుచుకున్నాయా? అన్నదానిపై జూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.