మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి హెలికాప్టర్‌ను విరాళంగా ఇవ్వనున్నట్టు కర్ణాటకకు చెందిన భక్తుడు వెల్లడించారు. రాంనగర్‌కు చెందిన శ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సురేశ్.. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు హెలికాప్టర్‌ను విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. నవంబరు 24న మంత్రాలయానికి వెళ్లి పీఠాధిపతితో దీనిపై చర్చించినట్టు పేర్కొన్నారు. బెంగళూరు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో 253 అడుగుల ఎత్తులో రాఘవేంద్రస్వామి విగ్రహాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన చెప్పారు.
శ్రీమఠానికి హెలికాప్టర్‌ను విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. అంతేకాదు, పీఠాధిపతి అనుమతితో మఠం అధికారులు మంత్రాలయంలో సూచించిన స్థలంలో హెలిప్యాడ్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. హెలిప్యాడ్ పనులు పూర్తయితే సంక్రాంతి పండగకు హెలికాప్టర్‌ను మంత్రాలయ పీఠాధిపతికి అందజేసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే, బెంగళూరులో రాఘవేంద్రస్వామి విగ్రహం ప్రతిష్ఠించనున్న స్థలాన్ని సుబుదేంద్ర తీర్థులు డిసెంబర్ మొదటి వారంలో పరిశీలించి, భూమి పూజ చేస్తారని సురేశ్ స్పష్టం చేశారు.
కాగా, భక్తుల విరాళాలతో మంత్రాలయంలో మినీ-ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంత్రాలయానికి నేరుగా రైల్వే లైన్ కూడా లేదు. 13 కిలోమీటర్ల దూరంలోని మాధవరంలో రైలు దిగి.. రాఘవేంద్రస్వామి ఆలయానికి చేరుకోవాలి. అటు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప గతేడాది కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. గతంలో ఆలయ అభివృద్ధి కోసం బళ్లారికి చెందిన మైనింగ్ వ్యాపారి రూ.90 లక్షలు ప్రకటించారు. రూ.6 కోట్లతో చేపట్టిన మంత్రాలయ మఠంలో శిలా మండప నిర్మాణానికి సహకరించారు.