ఎట్టకేలకు గత 17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన 41మంది కార్మికులు ఒక్కొక్కరుగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణుల బృందాలు, అధికార యంత్రాంగం రాత్రనకా పగలనకా శ్రమించి, 400గంటలకు పైగా ముమ్మరంగా కొనసాగించిన సహాయక చర్యలు ఫలించాయి.
రాత్రి 8గంటలకు మొదట కార్మికుడు బయటకు రాగా, మొత్తంగా అందరినీ బయటకు తీసుకురావడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేసినా ఒక గంటలోనే అందరినీ విజయవంతంగా బయటకు తీసుకువచ్చారు. బయటకు తీసుకొచ్చిన వెంటనే వారిని అప్పటికే సిద్ధం చేసి వుంచిన అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. వారి శారీరక, మానసిక ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు అక్కడ డాక్టర్లు సిద్ధంగా వున్నారు.
ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్‌యారా వద్ద సొరంగం నిర్మాణ పనులు జరుగుతుండగా, ఈ నెల 12న ఒక్కసారిగా సొరంగం కుప్పకూలడంతో 41మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. అప్పటి నుండి వారిని వెలుపలకు తీసుకొచ్చేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. సొరంగం ముఖ ద్వారం వద్ద భారీగా పడివున్న శిధిలాల దిబ్బలను తొలగించే క్రమంలో అధికారులకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నేలకు సమాంతరంగా తవ్వుతున్న పనులకు పదే పదే ఆటంకాలు ఏర్పడి ముందుకు సాగకపోవడంతో నిలువుగా కొండను తవ్వేందుకు కూడా సిద్దపడ్డారు.
సొరంగానికి అడ్డంగా కూలిన శిథిలాల దిబ్బలను తొలగించేందుకు రప్పించిన అగర్ యంత్రం కూడా అనేకసార్లు సతాయించడంతో అధికారులకు ఈ తొలగింపు చర్యలు సవాలుగా మారాయి. సొరంగంలో 57 మీటర్ల వద్ద శిధిలాల తొలగింపులో యంత్రాలు పనిచేయకపోవడంతో ర్యాట్ హోల్ మైనర్ల సాయంతో మాన్యువల్ డ్రిల్లింగ్ చేపట్టి విజయవంతంగా పూర్తి చేశారు.
కార్మికులు బయటకు వచ్చిన వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి, కేంద్ర సహాయ మంత్రి జనరల్ రిటైర్డ్ వి.కె.సింగ్ వారిని కలుసుకున్నారు. వారిని పూలమాలలతో సత్కరించి, ఆలింగనం చేసుకుని పరామర్శించారు. తమ వారి కోసం కళ్లలో వత్తులు వేసుకుని సొరంగం వద్ద వేచి చూస్తున్న వారి కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకపోయాయి.