రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యకు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ అశీష్ కమార్ సేన్ పూర్తిగా బాధ్యుడని విచారణ కమిటీ నివేదిక ఇవ్వడంతో యాజమాన్యం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ ఏడాది మార్చి 31న మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ వద్ద పిహెచ్‌డి స్కాలర్ అయిన 31 ఏళ్ల సచిన్ కుమార్ జైన్ ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై జైన్ సోదరుడు భవేష్ జైన్ ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటికి ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు రాసిన ఆరు పేజీల లేఖలో పిహెచ్‌డి గైడ్, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ప్రొఫెసర్ అశీష్ కుమార్ సేన్ వేధింపుల కారణంగానే తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాగే తోటి విద్యార్థులు కూడా సచిన్ కుమార్ ఆత్మహత్యపై దర్యాప్తు జరపాలని కోరారు. దీంతో మాజీ డిజిపి జి తిలగవతి అధ్యక్షత ఐదుగురు బృందంతో విచారణ కమిటీని నియమించారు.
విచారణ జరిపిన ఈ కమిటీ ప్రొఫెసర్ అశీష్ కుమార్ వేధింపుల కారణంగానే సచిన్ ఆత్మహత్యకు పాల్పడ్డారని నిర్ధారించింది. సచిన్ రీసెర్చ్ ఐదేళ్లలో పూర్తి కావాల్సి ఉందని, అయితే అశీష్ కుమార్ చర్యల వలన ఎనిమిదేళ్లు అయినా పూర్తికాలేదని కమిటీ గుర్తించింది.