ఉత్తరాఖండ్లో సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కార్మికులు సురక్షితంగా బయటకు రావడంపై రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన మోదీ.. కార్మికుల ధైర్యం గొప్పదని కొనియాడారు. ఉత్తరకాశీలోని సొరంగం నుంచి బయటపడిన బాధితులతో ప్రధాని మోదీ తాజాగా ఫోన్‌లో మాట్లాడారు. 17 రోజుల తర్వాత.. ఎన్నోకష్టాలను ఓర్చి కార్మికులంతా సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. మోదీతో మాట్లాడిన కార్మికులు.. మొదట చాలా భయపడ్డాం కానీ బతుకుపై ఆశ కోల్పోలేదని.. ధైర్యంగా ఒకరికొకరం అండగా నిలుస్తూ బతుకు కోసం పోరాడమని చెప్పారు.
ఎంతోకష్టం తర్వాత కూడా కార్మికులంతా బయటపడటం చాలా సంతోషంగా ఉందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాను ఫీల్ అవుతున్న భావాన్ని మాటల్లో చెప్పలేనంటూ ఉద్వేగానికి గురయ్యారు. ఏదైనా ఘోరం జరిగి ఉంటే మనసును అదుపు చేసుకోవటం చాలా కష్టమయ్యేదని అన్నారు.. కేదార్‌నాథ్ బాబా, బద్రీనాథ్ భగవాన్ ఆశీస్సులతో కూలీలంతా బయటపడ్డారని.. 17 రోజుల పాటు ఎంతో ధైర్యం కనబరిచారని పేర్కొన్నారు.
“నేను నిరంతరం సమాచారం తెలుసుకునేవాణ్ని. సీఎంతోనూ ఎప్పటికప్పుడు మాట్లాడేవాణ్ని. పీఎంవో అధికారులు అక్కడికి వచ్చి కూర్చున్నారు. సమాచారం తెలిసినప్పటికీ మనసులో ఆందోళన మాత్రం అలాగే ఉండేది. ఎంతమంది అయితే బయటపడ్డారో అందరికీ.. వారి కుటుంబ సభ్యుల పుణ్యం కూడా పనిచేసింది.” – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి